TSLPRB NEWS

మొత్తం 11 ప్రాంతాల్లో నిర్వహణ -తొలిసారిగా టెక్నాలజీ వినియోగం -సాంకేతిక సిబ్బంది నియామకం -పూర్తి ఏర్పాట్లుచేసిన టీఎస్‌ఎల్పీఆర్బీ
● రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు సోమవారంనుంచి దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో వీటిని నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) అన్నిఏర్పాట్లు పూర్తిచేసింది. పోలీస్ నియామక ప్రక్రియలో తొలిసారిగా సాంకేతికతను వినియోగిస్తున్నారు. మొత్తం 1,217 ఎస్సై పోస్టులకు 1,10,635 మంది, 16,925 కానిస్టేబుల్ పోస్టులకు 2,28,865 మంది ఈవెంట్స్‌కు అర్హత సాధించారు.
ఫిజికల్ మెజర్‌మెంట్స్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ)లకు హాజరయ్యే అభ్యర్థుల అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్ ప్రక్రియ శనివారానికే పూర్తయింది. అందులో నిర్ణయించిన తేదీలవారీగా అభ్యర్థులు తమ కేటాయించిన మైదానాల్లో దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యేందుకు సన్నద్ధమవుతున్నారు. పురుష అభ్యర్థులకు రోజుకు వెయ్యి మంది చొప్పున, మహిళలకు రోజుకు 1400 మంది చొప్పున ఈవెంట్స్ నిర్వహించేలా టీఎస్‌ఎల్పీఆర్బీ సన్నద్ధమవుతున్నది.

●హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి దరఖాస్తుచేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్‌లోని మూడుప్రాంతాల్లో (అంబర్‌పేట, యూసుఫ్‌గూడ, కొండాపూర్), ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకేంద్రాల మైదానాల్లో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని మూడు మైదానాల్లో ఒకేసారి హైజంప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, జిల్లా కేంద్రాల్లో ఒకేసారి రెండు ఫీల్డ్ ఈవెంట్స్ నిర్వహించేలా నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు. అన్ని మైదానాల్లో పోలీస్ సిబ్బందితోపాటు పదిమందితో కూడిన సాంకేతిక నిపుణుల బృందాలు అందుబాటులో ఉంటాయి. ఎక్కడైనా సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరిస్తాయి.

●సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను జిల్లాల ఎస్పీలకు అప్పగించారు. ప్రతిఅభ్యర్థి ధ్రువపత్రాలు పరిశీలించిన తర్వాత బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రను పోల్చి చూస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో తీసుకున్న వేలిముద్రలతో సరిపోలితేనే అభ్యర్థిని ఫిజికల్ ఈవెంట్స్‌కు అనుమతిస్తారు. బయోమెట్రిక్‌లో ఇబ్బందులు రాకుండా చేతివేళ్లపై గోరింటాకు, మెహిందీవంటివి పెట్టుకోవద్దని అధికారులు సూచించారు. అభ్యర్థులకు ఎత్తు, ఛాతి కొలతలను గతంలో మాదిరిగా టేపులతో కాకుండా డిజిటల్ మీటర్ల ద్వారా కొలువనున్నారు. ప్రతి కొలత వెంటనే కంప్యూటర్‌లోని అభ్యర్థి వివరాల జాబితాలో నమోదవుతుంది. అది సర్వర్‌లోకి వెళ్తుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ కొలతలు మార్చే వీలుండదు. అభ్యర్థులకు ఫిజికల్ మెజర్‌మెంట్స్ తర్వాత పీఈటీ నిర్వహిస్తారు. అభ్యర్థులకు తొలుత 100 మీటర్ల పరుగు, ఆ తర్వాత లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్లలో అక్కడ అందుబాటును బట్టి మూడింటిలో ఏ క్రమంలోనైనా పూర్తిచేస్తారు. చివరగా 800 పరుగు పందెం ఉంటుందని టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. మహిళా అభ్యర్థులకు తొలుత 100 మీటర్ల పరుగు, తర్వాత లాంగ్‌జంప్, షాట్‌పుట్ ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) చిప్స్ వినియోగిస్తారు. లాంగ్‌జంప్, షాట్‌పుట్‌లను టేప్‌లతో కాకుండా సివిల్ ఇంజినీరింగ్ వాళ్లు వినియోగించే థియోడొలైట్ పరికరంతో లెక్కించనున్నారు. హైజంప్‌ను మాత్రం పాత పద్ధతిలోనే లెక్కిస్తారు.

●గతంతోపోలిస్తే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను టీఎస్‌ఎల్పీఆర్బీ సులభంచేసింది. గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేషన్‌ను తొలిగించి, సెల్ఫ్ అటెస్టేషన్ (అన్ని జీరాక్స్‌లపై అభ్యర్థి సంతకం) పద్ధతిని తీసుకొచ్చింది. అడ్మిట్‌కార్డు, పార్ట్-2 అప్లికేషన్, కుల ధ్రువీకరణపత్రం, ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా అభ్యర్థులు ఆ ధ్రువీకరణ పత్రం, ఆదివాసీల్లో ఎస్టీ అభ్యర్థులు ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్ జిరాక్సులు తీసుకొనిరావాలి.